September 2, 2026 10:41 am

కాంగ్రెస్ పార్టీలో పీత వేదాంతం. రేవంత్కు అడుగడుగునా శరాఘాతం.

వేంకట ఫణి కుమార్. బుక్కపట్టణం

కాంగ్రెస్ పార్టీలో పీత వేదాంతం అనాదిగా అలవాటే. స్వపక్షంలో వుంటూ కూడా విపక్షంగా వ్యవహరించే సంప్రదాయం కేవలం కాంగ్రెస్ పార్టీకే చెల్లు. గతంలోనూ తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వున్నప్పటికీ ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం గీచిన గీతను దాటి ప్రవర్తించిన దాఖలాలు వున్నాయి. డా.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నపుడు వి. హనుమంతరావు తను విడిగా ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని రాజశేఖర రెడ్డిపై దుమ్ము ఎత్తి పోసేవారు. ప్రతి నిర్ణయాన్ని ఢిల్లీలో పత్రిక సమావేశం నిర్వహించి రాజారెడ్డి రాజ్యాంగం అంటూ తీవ్రంగా విమర్శలు చేయడం పరిపాటే. కాంగ్రెస్ 2004లో అధికారంలోకి వచ్చాక సీనియర్ నాయకుడు జానారెడ్డికి హోంశాఖ మంత్రి పదవి దక్కింది. అయినప్పటికీ ఆయన శాంతించలేదు. నిత్యం ఆయన వర్గీయులు ఢిల్లీకి లేఖలు రాసేవారు. అధికారిక కార్యక్రమాల ముసుగులో కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశం అయి ముఖ్యమంత్రి పై తీవ్ర ఆరోపణలు చేసేవారు. డా. రాజశేఖర రెడ్డి దుర్మరణంతో అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు రాజశేఖర రెడ్డి తనయుడు జగన్, ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి. జానారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే…యాదృశ్చికంగా రోశయ్య కు ఆ గౌరవం దక్కింది. తిరుగులేని వాగ్ధాటితో ప్రతిపక్షాన్ని గడ్డి కరిపించే నాయకుడుగా పేరున్న రోశయ్య వర్గంలోనే జానారెడ్డి కొనసాగుతుండడంతో రోశయ్యకు ఈ తలపోటు కాస్త తగ్గింది. పైగా పార్టీ పెద్దదిక్కును కోల్పోయిందనే కారణంతో స్తబ్తత నెలకొంది. సుమారుగా 15 నెలల పాటు రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు జగన్మోహన రెడ్డి కొత్తపార్టీలోకి వెళ్లిపోగా, మరికొందరు అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలస వెళ్లారు. కొణజేటి రోశయ్య అనుభవం కొన్నాళ్లు కాంగ్రెస్ పార్టీని కాపాడింది. కానీ నిత్యం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆకాంక్ష తారాస్థాయికి చేరింది. క్షణ క్షణానికి తెలుగురాష్ట్రంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. దీంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నూతన మఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టారు. ఆ నేపథ్యంలోనూ వ్యతిరేక వర్గాలు ఘాటైన విమర్శలతో కిరణ్ ను విసిగించేవారు. రెడ్డి సామాజికవర్గం మాత్రమే ముఖ్యమంత్రి పదవికి అర్హత కలిగినట్లా అంటూ కొందరు ఎంపీలు, శాసన సభ్యులు చెలరేగిపోయేవారు. ఆపై కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకున్నారు.

దేశంలోని ఏ జాతీయ రాజకీయ పార్టీలో లేని స్వాతంత్ర్యం ఈ పార్టీలో వుంటుందని చెప్పుకుంటారు. అదే విధంగా దశాబ్దం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోనూ లుకలుకలు తగ్గలేదు. పార్టీలోని నాయకులు నేటికీ తెలంగాణ మఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిత్యం నిప్పులు చెరుగుతూనే వున్నారు. రేవంత్ నియంతలా వ్యవహరిస్తున్నారని, సొంత వర్గంలోని నాయకులకు మాత్రమే పనులుచేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. అధికారికంగా తన బంధువులు ముఖ్యమంత్రి కార్యాలయానికి దరిదాపుల్లో లేకపోయినా తన సోదరుడు చక్రం తిప్పుతున్నాడనే సమాచారం కొందరు నాయకులు అధిష్ఠానం చెవుల్లోనిత్యం వినిపిస్తున్నారు. కేవలం గత ప్రభుత్వంలో కీలకంగా వున్న అధికారులనే రేవంత్ కొనసాగిస్తున్నారనే అభియోగాలు సియం ఎదుర్కుంటున్నారు. సియం కుర్చీలో కూర్చున్నప్పటికీ ప్రతిక్షణం ఆయన అగ్ని పరీక్షకు గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కూడా రేవంత్ పై అసంతృప్తి వున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ని నిత్యం పొగడ్తలతో ముంచెత్తే ఓ మంత్రి గారు…రేవంత్ వెనుక గోతులు సిద్ధంగా వుంచినట్లు హస్తినలో గుసగుసలు వినిసిస్తున్నాయి. ఇప్పటికే అన్ని సామాజిక వర్గాలు పార్టీకి దూరంగా వెళ్లిపోతున్నాయని చెవులు కొరుక్కుంటున్నారు.  త్వరలోనే రేవంత్ ఉద్వాసన తప్పదనే ప్రచారం గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి రేవంత్ రెడ్డికి మధ్య అంతరం పెరిగిపోతున్నదనే లోగుట్టు ను ఇరుపక్షాలు ఖండించడం లేదు.

ఇది ఇలా వుండగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గీసుకొండలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ రెడ్డి పరువును దిగజారుస్తూ సుస్మిత మాట్లాడారు. ఈ అంశంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదు అందింది. ఈ నేపధ్యంలో మంత్రి కొండా సురేఖ అధిష్ఠానం నుంచి శ్రీముఖం అందుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సురేఖ ఢిల్లీ వెళ్లారు.

ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దిగజార్చేందుకు కాంగ్రెస్ పార్టీలోని సీయం పీఠం కోసం పోటీ పడుతున్న ఆశావహులు హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాహుల్ గాంధీకి రేవంత్ పై ఫిర్యాదులు చేస్తున్నారు. రేవంత్ కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి గల్లంతు కావడం ఖాయమని తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ దర్శనం రేవంత్ కు దక్కడం లేదనే చెప్పుకుంటున్నారు. అయితే రాష్ట్ర పార్టీలో క్రమశిక్షణ అధికారాలు కలిగిన ఆ నాయకుడే క్రమశిక్షణ రాహిత్యంతో వ్యవహరిస్తున్నట్లు కార్యకర్తల నుంచి వార్తలు వస్తున్నాయి.      

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top