కరవు నేలపై నీటి ప్రవాహం పరుగులు పెట్టింది. దశాబ్ధాలుగా కలలు కన్న ఆ ప్రాంతం ఇక నీటి కటకట నుంచి బయటపడి, పచ్చని పంటలతో సస్యశ్యామలం కాబోతున్నది. కరవు కన్నీళ్ల స్థానంలో అక్కడ ఆనందభాష్పాలు విరిశాయి. ప్రజలు జలజల తరంగాలను తమ చేతితో స్పృసించి పరవశించిపోయారు. ఆ క్షణంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరి కళ్లు చెమ్మగిల్లాయి. ఆ భావోద్వేగాలను అక్షరాలతో పూరించడం అలవికాదు.
మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని వెలిగొండ నీటి ప్రాజెక్టును సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. తరతరాలుగా కరవు పీడిత ప్రాంతంగా ముద్రపడిన ఈ జిల్లా ఇకపపై కృష్ణమ్మ పరవళ్లతో , పరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని చంద్రబాబు ఒకింత భావోద్వేగంతో పేర్కొన్నారు. బీటలుబారిన నేల నేటి నుంచి బంగారు భూమి కాబోతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినపుడు పొందే సంతృప్తిని అనుభవిస్తేనే తెలుస్తుందని పిమం అన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమం అనగానే అధికారుల హడావుడి, పోలీసుల సైరన్ల మోతలు సర్వసాధారణం. కానీ ఇక్కడ నిర్వాసితులతో కలసి సియం చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతంలో కలియతిరిగారు. ఈ ప్రాజెక్టు కల సాకారం చేసుకునేందుకు ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా హృదయపూర్వక నమస్కరాలు తెలియజేస్తున్నాను అని బహిరంగసభలో చంద్రబాబు తన ప్రసంగంలో అన్నారు.
వెలిగొండ ఫీడర్ కాల్వ వద్ద నీటి ప్రవాహాన్ని చూస్తూ సియం తీవ్ర భావోద్వేగానికి గురవ్వడం అక్కడి ప్రజలను కూడా కంటతడి పెట్టించింది. 7 సదుల వయసు దాటిన ముఖ్యమంత్రి స్థితిని చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. జలహారతి, పుష్పనిదేదన చేసిన చంద్రబాబు కెనాల్ ఒడ్డు నుంచి కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం సమర్పించారు.



