శ్రీ వేంకటేశ్వరుడు కొలువుండే స్వర్గధామం వైకుంఠం. కలియుగంలో శ్రీ మహావిష్ణువు భూలోకంలో శ్రీనివాసుడి అవతారంలో భక్తులకు వరప్రదాయడుగా కటాక్షిస్తున్నాడు. నారాయణ అని ఆర్ధ్రతతో పిలిస్తే చాలు నేనున్నాను అంటూ…శేషవాహనం నుంచి ఉన్నఫళంగా శంఖుచక్రాలను తారుమారుగా ధరించి భక్తుని కడకు చేరుకుంటాడు. భక్తుల కంటే మరెవ్వరూ నాకు ముల్లోకాల్లో సరికాదని నిరూపిస్తాడు. భక్తలు కోసం భగవంతుడే స్వయంగా ఈ కలియుగంలో కూడా దిగి వస్తాడని నిరూపించిన భక్తజన పక్షపాతి ఆ వేంకటేశ్వరుడు.
దుష్టశిక్షణ కోసం ఆది అవతారం నుంచి దశావతారాలు యుద్ధం చేసిన శ్రీమహావిష్ణువు చిదానంద స్వరూపుడై, ఆనంద నిలయంలో వెలిశాడు. తిరుమలకు మరోపేరు ఆనంద నిలయం. అందుకే అక్కడికి వెళ్లిన వారికి చిరునవ్వు కానుకగా దొరుకుతుంది.ఆనందంగా ప్రకటితమవుతూన్న ఆ కలియుగ వైకుంఠవాసునికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ వివరాలలోకి వెళితే…..
అలిపిరి తొలిమెట్టుపై భక్తుడు కాలు మోపగానే తన్మయత్వంలో మునిగిపోతాడు. శ్రావ్యంగా చెవులను తాకే భక్తిరస కీర్తనలు భక్తి శ్రద్ధలను ద్విగిణీకృతం చేస్తాయి. స్వామిపై 32 వేల సంకీర్తనలు రచించిన అన్నమయ్య చేతి నుంచి జాలువ్రాలిన పద కవితలు భావోద్వేగానికి గురిచేస్తాయి. అల్లంత దూరాన, ఏడు కొండలపై నెలకొని వున్న శ్రీహరివాసము రారమ్మంటూ పిలిచినట్లే భక్తులు భావిస్తారు. ఆ స్వామి ప్రతి భక్తుడిని ప్రేమతో ఆహ్వానించినంత ఆనందాన్ని పొందుతారు. ఏడు కొండలపైకి విహారానికి వెళ్లినట్లుగా కాక, ఆ గోవిందుని పాద ముద్రలను అనుసరిస్తూ.. ఏడు కొండల స్వామీ.. ఎక్కడ వున్నావయ్యా అంటూ వెదకినట్లే వుంటుంది. త్యాగరాయ పంచరత్నకృతుల ఆలాపనలు వినవస్తుండగా,, శేషాచలంలోని వృక్షాలు ఆ స్వామికి చెలులుగా మారి, నాట్యం చేసినట్లే వుంటుంది. అలంకారప్రియుడు ఆ ప్రాంతంలో నడయాడిన ఆనవాలు నేటికి స్పురిస్తూ వుంటుంది. అడుగడుగునా సెలఏళ్లు అమృతధార తీర్థంగా అందించగా, నడకదారి భక్తులకు వెయ్యి ఏనుగుల బలం చేకూరుతుంది. గోవింద నామస్మరణలో అలుపెరుగని భక్తులు పర్వత శ్రేణిని దాటుకుంటూ స్వామి చెంతకు వడివడిగా అడుగులు వేయడం కనిపిస్తుంది. మరికొంత దూరంలోనే వున్నానని ఆ దేవ దేవుడు పిల్లగాలులతో కబురు పంపిస్తాడు. అదిగో ఆ స్వామి సమీపంలోకి వచ్చేశామంటూ ఆపన్నులు మరింత పెద్ద అంగలు వేస్తూముందుకు సాగుతారు. ఆదిశేషుని ఏడు పడగలు అయిన శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి పర్వతాలను చేరుకుని ఒక్కోమెట్టు ఎక్కుతుంటే, సోపానానికి మెట్టుగా భావిస్తూ పులకించిపోతారు. ఏడు కొండలపై కాలు మోపగానే ఏడేడు జన్మల సర్వపాపాలు, సర్వ దోషాలు పటాపంచలవుతాయి. శ్రీవారికి కైంకర్యం చేసే ఆదిశేషుని స్పర్శకే ఇంత మహత్తు వుంటే… సర్వలోకాలను పాలించే ఆ తిరునామధారుని దర్శనంతో…. భవసాగర బాధలు సాగరంలో కలిసిపోతాయి. చక్ర, గధాధారి అయినప్పటికీ శ్రీనివాసుని అవతారంలో స్వామి ఏనాడూ ఆగ్రహం తెచ్చుకోలేదు. అందుకే ఆ ఆలయానికి ఆనంద నిలయం అని పేరు. స్వామి అక్కడ ఆనంద కేళిలో మునిగి తేలుతాడు. అందుకే ఆ కిరీటధారిని చూడగానే సర్వం మరచి ముగ్థులు అయిపోతారు.
సాధారణంగానే స్వామి మోహన స్వరూపుడు.. ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు. అటువంటి ఆ స్వామికి బ్రహ్మోత్సవాల విశేష సేవలతో మరింత శోభ చేకూరుతుంది. అనేక అలంకారాల సేవలతో ఆ శ్రీహరి స్వరూపాన్ని వర్ణించడానికి మానవ మాత్రులకు సాధ్యము కాదు. అందుకే ఆ జగన్మోహనుడు అన్నమయ్య ను సృష్టించి, సంకీర్తనాచార్యులనే బిరుదును ప్రదానం చేశాడు. బ్రహ్మోత్సవాలను విశేషంగా వర్ణిస్తూ అన్నమయ్య నవరసాలను తన పదకవితల్లో పలికించాడు.
వినరోభాగ్యము విష్ణు కథ అంటూ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని వర్ణించాడు. గగనమనకు ఎత్తిన అంటూ ధ్వజారోహణానికి అనుబంధంగా రచించాడు. ఆ స్వామి వాహనసేవలకు కీర్తలను అందించాడు. బ్రహ్యోత్సవాల ముగింపు లోని చక్రస్నాన ప్రక్రియను అన్నమయ్య తన పాటలో పొడగింటినయ్య నిన్ను పురషోత్తమా… అని దేవేరులతో సహా శ్రీవారిని మెప్పించాడు. ఆ సేవల వివరాలు ఇదిగో….
అంకురారోపణ
బ్రహ్మోత్సవ సంరభం ధ్వజారోహణతో ప్రారంభమవుతుంది. ధ్వజారోహణ చేయడానికి ముందురోజు సాయంత్రం తన భార్యలైన సూత్రవతి, జయాదేవిలతో కూడి విష్వక్సేనుడు భూమిపూజను నిర్వహిస్తాడు. ఛత్రచామర మంగళవాద్య పురస్సరంగా విష్వక్సేనుడు ఆలయంలోకి ప్రదక్షిణ మార్గంలో ప్రవేశిస్తాడు. నైరుతి దిశలో భూమిపూజ చేసిన తరువాత మృత్ సంగ్రహణం (మట్టిని తీసుకురావడం) చేస్తాడు. ఆనాటి రాత్రివేళ నవధాన్యాలతో బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ (బీజావాపం) జరుగుతుంది.
ధ్వజారోహణం
బ్రహ్మోత్సవ సంరభ ప్రారంభ సూచికగా గరుడ ధ్వజాన్ని ప్రతిష్ఠ చేస్తారు. కంకణధారణ చేసి ఆలయం లోపల, బయట అష్టదిక్కుల్లో బలిని వేస్తారు. మలయప్పస్వామి ధ్వజస్తంభం వద్దకు విచ్చేసిన తరువాత పరివార దేవతలైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగదులు విమాన ప్రదక్షిణంలో ఉన్న అంకురార్పణ మంటపానికి విజయం చేస్తారు.
అత్యంత శోభాయమానంగా ఉభయ దేవేరీ సమేతుడైన ఉత్సవరాయడు మలయప్ప సమక్షంలో ధ్వజారోహణం జరుగుతుంది. ధ్వజాన్ని అధిరోహించే ముందుగా గరుడాళ్వార్ ముద్గలాన్నం అని పిలిచే పెసరపప్పు పులగం నివేదనగా అందుకుంటాడు. ధ్వజంపై నిలిచి సకలలోకాల్లోని శ్రీవారి భక్తులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతాడు.
ఈ ధ్వజారోహణ వేళకే శ్రీవారి భక్తుల పక్షాన రాష్ట్రముఖ్యమంత్రి స్వామికి పట్టుపీతాంబరాలను అందచేయడం ఆచారంగా ఉంది. ఆ తరువాత వాహనసేవలు ప్రారంభమవుతాయి. ఈ వాహన సేవల వైభవ విశేషాలను స్మరించుకుందాం.
పెద్దశేషవాహనం
శ్రీవారికి తొలి బ్రహ్మోత్సవ వాహన సేవను వరంగా పొందాడు ఆదిశేషుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపరంలో బలరాముడిగా దేవదేవునికి అత్యంత సన్నిహితుడు ఆదిశేషుడు. శ్రీవైకుంఠంలో నిత్యశయ్య. కలియుగంలో అదే శేషుడు గోవిందరాజస్వామిగా, వేంకటాచలంగా, ఆయుర్వేద వైద్యశిఖామణి చరకుడిగా, పాణిని వ్యాకరణ భాష్యకర్త, యోగసూత్ర వ్యాకర్త అయిన పతంజలి మహర్షిగా, విశిష్టాద్వైత ప్రబోధక శ్రీరామానుజాచార్యగా వివిధ రూపాల్లో అవతరించిన మహనీయుడు. శ్రీవారికి నివాసభూమిగా, పక్కగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునే మెత్తగా, ఛత్రంగా వివిధ రూపాలలో సేవలందించిన దాసుడు ఆదిశేషుడు. పెద్దశేషవాహన సేవవల్ల పశుత్వం తొలగిపోయి, మానవత్వం… దానిలోనుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. మానవుల మనసుల్లోని విషతుల్యమైన పాపాలను ప్రక్షాళన చేసే విశిష్ట సేవ ఇది.
చిన్నశేషవాహనం
ఆదిశేషుడే శ్రీవారికి రెండోరోజు చిన్నశేషుడిగా మళ్లీ సేవలందిస్తాడు. ఈ వాహనసేవ శేషశేషి భావాన్ని పెంపొందిస్తుంది. కుండలినీ శక్తి మానవునిలో సర్పాకారంలో వెన్నెముక ఉండేచోట ఉద్భవిస్తుంది. ఆ వాహనసేవ భక్తులకు ఆ యోగమార్గాన్ని చేరుకునేందుకు ప్రేరణ ఇస్తుంది. యోగసిద్ధిని అన్వేషించే జిజ్ఞాసువులకు బ్రహ్మోత్సవ వాహనసేవ మహోపకారి.
హంసవాహనం
రెండోరోజు రాత్రి శ్రీవారు హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతీ రూపంలో విజయం చేస్తారు. ‘హంసస్తు పరమేశ్వర:’ అని ఉపనిషత్తులు హంసతత్వాన్ని కీర్తిస్తున్నాయి. హంసలు నీళ్లను, పాలను వేరుచేసి, పాలను స్వీకరిస్తాయి. భగవానుడు ఆత్మానాత్మ వివేకాన్ని అనుగ్రహిస్తూ హంసవాహనం ద్వారా ఆశ్రయించిన వారిలోని అహంభావాన్ని తొలగిస్తాడు. సోహం భావన కలిగిన భక్తులను ఉద్ధరిస్తూ అహంకారం తొలగించి దాసోహం అన్న శరణాగతిని ప్రబోధిస్తాడు.
సింహవాహనం
బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై విహరిస్తారు. సింహం పరాక్రమానికి, శీఘ్రగమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. ఆనందనిలయ ప్రాకారంపై కూడా పరాక్రమస్ఫూర్తినిస్తూ సింహాలు గోచరిస్తాయి. దుష్టశిక్షకుడైన శ్రీనివాసుని వైభవానికి సింహవాహనం చక్కని అమరిక. తన భక్తులకు ధర్మదీక్ష పట్ల అనురక్తిని, ప్రతాపస్ఫూర్తిని శ్రీహరి ఈ వాహన సేవాఫలంగా కటాక్షిస్తాడు.
ముత్యపు పందిరి వాహనం
బ్రహ్మోత్సవాల్లో మరులు గొలిపే ముత్యపు పందిరి వాహనంపై ముచ్చటగా శ్రీవారు కనువిందు చేస్తారు. ముత్యాలు ఓషధీపతి అయిన చంద్రునికి ప్రతీకలు. తెల్లని ముత్యాల హారాల మధ్య నిలిచిన శ్రీవారు దర్శించే భక్తుల తాపత్రయాలు తొలగిస్తాడు.
కల్పవృక్ష వాహనం
కల్పవృక్షం కోరిన కోరికలు మాత్రమే తీరుస్తుంది. కానీ శ్రీహరి మోక్షాన్ని కూడా అనుగ్రహించగలడు. మానవ జీవన ప్రస్థానానికి పరమావధి అయిన మోక్షఫలాన్ని ఇవ్వగల జనార్దనుడు కనుక కల్పవృక్షం ఆయనకు దాస్యం చేస్తోంది.
సర్వభూపాల వాహనం
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అంటూ వేదం శ్రీహరిని సకలభువన చక్రవర్తిగా ప్రబోధిస్తోంది. భూపాలులైన రాజన్యులందరూ వాహనస్థానీయులై శ్రీవారిని సేవిస్తారు.
మోహినీ అవతారం
బ్రహ్మోత్సవాలలో అయిదోనాటి ఉదయం మోహినీరూపంలో మాడవీధులలో శ్రీవారికి పక్కనే దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుని రూపం కూడా కనిపిస్తుంది. అన్ని సేవలు వాహనమండపం నుంచే మొదలవుతాయి. కానీ ఈ ఒక్క సేవలో మాత్రం శ్రీవారు దేవాలయం నుంచే నేరుగా విచ్చేస్తారు. మోహం, మాయలను దాటాలంటే స్వామికి శరణాగతి చేయాలన్న దివ్యసందేశం ఇది.
గరుడ వాహనం
వాహనసేవల్లో గరుడ సేవ విశిష్టమైనది. దాసుడిగా, సఖుడిగా, విసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా బ్రహ్మోత్సవ ధ్వజంగా, అన్నింటికీ మించి నిత్యవాహనుడిగా గరుడుడు స్వామికి సేవలందిస్తాడు. గోదాదేవి సమర్పించిన మాలను, సహస్రనామమాలను, లక్ష్మీహారం వంటి మూలవరుల ఆభరణాలతో స్వామి ఊరేగే ఈ గరుడ వాహన సేవకు పెరియ తిరువడి అని పేరు. వినతాసుతుడైన గరుత్మంతుని మహోన్నత సేవ మానవులకు జ్ఞాన వైరాగ్యాలను, అభీష్టసిద్ధిని కటాక్షిస్తుంది.
హనుమద్వాహనం
ఆరవరోజు ఉదయం బ్రహ్మోత్సవ రాయడు వేంకటాద్రి రాముడై హనుమద్వాహన సేవలో శోభిల్లుతాడు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వాక్పటుత్వం కటాక్షించే హనుంమంతుని సేవలు అందుకుంటూ శ్రీహరి భక్తలకు దాస్యభక్తిలోని ఔన్నత్యాన్ని చాటి సద్భుద్ధిని ప్రసాదిస్తాడు.
స్వర్ణరథోత్సవం
సాయంత్రవేళ బంగారుతేరులో బ్రహ్మాండనాయకుడు ఉభయదేవేరులతో ప్రసన్నంగా గోచరిస్తాడు. నాడు శ్రీకృష్ణుని రథగమనం శ్లైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, మాహకాలనే గుర్రాలను పూన్చి దారుకుని సారధ్యంలో ముందుకు సాగింది. ఆనందనిలయవాసుడైన శ్రీనివాసుని స్వర్ణరధోత్సవంలో కూడా నాలుగు గుర్రాలను పూన్చిన రథంపై స్వామి దర్శనం కన్నుల పండుగ.
గజవాహనం
శ్రీనివాసుడు పార్వేటలో గజరాజును తరిమినప్పుడు పద్మావతీదేవిని చూసినట్లు శ్రీనివాసకల్యాణం చెబుతుంది. గజవాహనం అంటేనే సకల శ్రేయోదాయకం. కనుక బ్రహ్మ ఈ వాహనాన్ని శ్రీవారికి వసంతోత్సవం అనంతరం చక్కగా సిద్ధపరుస్తాడు.
సూర్యప్రభ వాహనం
సూర్యతేజం జీవులకు అభ్యుదయ కారకం. సూర్యమండలంలో శ్రీహరి కొలువై ఉంటాడు. సూర్యుడు తన సప్తకిరణాలతో కూడిన ప్రభను ఏడుకొండలవానికి వాహనంగా అందిస్తాడు. సూర్యప్రభలు విద్య, ఐశ్వర్యం, సంతానం, సుకవిత్వం, కాంతిని ప్రసాదిస్తాయి. సూర్యప్రభా వాహనంపై శ్రీవారి సేవలో పాల్గొంటే జీవుల శోకాలు తొలగి, వెలుగురేకల్లా జ్ఞానబీజాలు అంకురిస్తాయి.
చంద్రప్రభ వాహనం
ఏడోరోజు రాత్రి తెల్లని చంద్రప్రభా వాహనంపై విహరిస్తూ శ్రీవారు చల్లని తన చూపుల వెన్నెలతో లోకాన్ని అనుగ్రహిస్తారు. ఈ శ్రీహరిని సేవించిన భక్తకోటికి ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే త్రివిధ తాపాలు తొలగుతాయి.
రథోత్సవం
జన్మరాహిత్యాన్ని కటాక్షించి, ఆత్మానాత్మ వివేకాన్ని ప్రసాదించేది రథోత్సవం. రథికుడు ఆత్మ. శరీరమే రథం. బుద్ధి సారధి. మనస్సు పగ్గం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాలే వీధులు. ఉపనిషత్తులు చేసే ఈ బోధ స్థూల శరీరం వేరని, సూక్ష్మశరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే జ్ఞానం కలిగిస్తుంది. శ్రీవారి ఈ రథవాహనాన్ని ఎనిమిదోరోజు ఉదయం ఎందరో భక్తులు తమ చేతులతో ముందుకు నడిపించే భాగ్యం పొందుతున్నారు.
అశ్వవాహనం
శ్రీవారి ఈ వాహన సేవ కలిదోషాలను పరిహరిస్తుంది. పటుత్వాన్ని కలిగించి, నామ సంకీర్తనాదుల ద్వారా తరించేందుకు తగు ప్రబోధాన్ని కలిగిస్తుంది.
చక్రస్నానం
యజ్ఞాంతంలో జరిగే అవబృధం చక్రస్నానం. బ్రహ్మోత్సవాలు మహోన్నత యజ్ఞఫలాన్నిస్తున్నాయి. శ్రీవారు ఉభయదేవేరులతో, చక్రత్తాళ్వార్లతో కలిసి వరాహస్వామి ఆలయంలో నిలిచి స్నపన తిరుమంజనాన్ని అందుకుంటారు. తొమ్మదిరోజులపాటు ఉదయం, సాయంత్రం వివిధ వాహనాలపై ఊరేగిన శ్రీవారు అలసట పొందుతారు. ఆ అలసట తీరేలా శ్రీవారికి ఆత్మస్థానీయుడైన చక్రత్తాళ్వార్లు స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారు. పదోరోజు రాత్రి గరుడ ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతాయి.
బ్రహ్మోత్సవాలను భక్తితో సేవించిన వారికి సమస్త పాప విముక్తి లభిస్తుంది. ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. అపమృత్యువు నివారణమవుతుంది. సకల లౌకిక శ్రేయస్సులు కలిగి తదనంతరం శాశ్వత విష్ణులోక ప్రాప్తిని పొందుతారు.
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే


